: రెండో రోజు ఆట ప్రారంభం... మొదలైన సఫారీల వికెట్ల పతనం
ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య నాగ్ పూర్ లో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తొలి రోజే 215 పరుగులకు టీమిండియా పెవిలియన్ చేరగా, అదే రోజు బ్యాటింగ్ కు దిగిన సఫారీలు 11 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకున్నారు. నేటి ఆటలో భాగంగా తొలి ఓవర్ లోనే సఫారీ కీలక బ్యాట్స్ మన్ ఎల్గర్ (7) ను చెన్నై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఫలితంగా ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయకుండానే సఫారీలు మూడో వికెట్ ను కోల్పోయారు. ఆ తర్వాత మరో ఓవర్ తర్వాత బంతిని తీసుకున్న అశ్విన్, హషీమ్ ఆమ్లా(1)ను సింగిల్ పరుగుకే పెవిలియన్ చేర్చాడు. దీంతో ప్రారంభంలోనే సఫారీల వికెట్ల పతనం మొదలైంది. జట్టును ఆదుకుంటాడనుకున్న సఫారీ స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్(0) ను ‘సర్’ రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. జడేజా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఏబీ అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆరు బంతులను ఎదుర్కొన్న ఏబీ సింగిల్ పరుగు కూడా చేయకుండానే వెనుదిరగడం విశేషం. తొలి రోజు ఆటలో సింగిల్ పరుగు మాత్రమే చేసిన సఫారీ జట్టు ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్లు ముగిసేసరికి 5 కీలక వికెట్లు చేజార్చుకున్న సఫారీలు 17 పరుగులు చేశారు. తొలి టెస్టులో భారత స్పిన్ ను ఎదుర్కోవడంలో నానా ఇబ్బందులు పడ్డ సఫారీలు మూడో టెస్టులోనూ అవే ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం డుప్లెసిస్ (4), డుమిని(1) క్రీజులో ఉన్నారు.