: ‘కృపామణి’ కీచకుడి అరెస్ట్... హైదరాబాదులో పట్టేసిన పోలీసులు


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కృపామణి ఆత్మహత్య కేసులో కీలక నిందితుడు గూడాల సాయి శ్రీనివాస్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన వివాహిత కృపామణిపై కన్న తల్లిదండ్రులే వేధింపులకు పాల్పడ్డారు. అనివార్య కారణాలతో పుట్టింటికి చేరిన కృపామణిని వ్యభిచారం చేయాలంటూ తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో అదే జిల్లాకు చెందిన రౌడీ షీటర్ గూడాల సాయి శ్రీనివాస్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాక నానాటికీ వేధింపులు పెరగడంతో తన ఆవేదనను సూసైడ్ నోట్ లో రాయడంతో పాటు తను అనుభవించిన నరకయాతనను సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సాక్షాత్తు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ కేసుపై దృష్టి సారించిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్ట్ చేశారు. కృపామణిపై వేధింపులకు అసలు కారణమైన శ్రీనివాస్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. అతడు విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాను వదిలి హైదరాబాదులో తలదాచుకున్న శ్రీనివాస్ ఆచూకీని కనిపెట్టిన పోలీసులు నిన్న రాత్రి అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం రాత్రికి రాత్రే అతడిని పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు.

  • Loading...

More Telugu News