: ఆమిర్ ఖాన్ పేరు అరుణ్ ఖన్నా అయినట్లయితే ఇన్ని విమర్శలు వచ్చేవా?: రచయిత్రి శోభా డే
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ‘అసహనం’ వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురుస్తోంది. అధికార పక్షం నేతలు, రాజకీయ పార్టీల నాయకులే కాకుండా బాలీవుడ్ లోని సినీ ప్రముఖులు కూడా ఈ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అలాగే ఆయనకు మద్దతిచ్చిన వారు కూడా ఉన్నారు. తాజాగా, ప్రముఖ రచయిత్రి శోభా డే స్పందించారు. ఈ విషయమై ఒక ఆంగ్ల ఛానల్ కు తన అభిప్రాయాలను తెలిపారు. ఆమిర్ ఖాన్ తమ వ్యక్తిగత సంభాషణలను ప్రజల ముందు ఉంచడం వల్లే లేనిపోని విమర్శలకు గురవుతున్నారని ఆమె పేర్కొంది. బాలీవుడ్ లో ఎటువంటి కళంకం లేకుండా ఉన్న నటుడు ఆమిర్ ఖాన్ అని, మిగిలిన ఇద్దరు ఖాన్ (షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్)లతో పోలిస్తే ఆమిర్ తీరు వేరని ఆమె అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీల నోటి నుంచి పొరపాటున ఒక మాట బయటకు వస్తే క్షమించే మనస్తత్వం మనకు లేకపోగా, దానిపై లేనిపోని చర్చలు జరుపుతామన్నారు. సెలబ్రిటీల కథ ముగియడానికి ‘వన్ రాంగ్ మూవ్, వన్ రాంగ్ స్టేట్ మెంట్’ చాలు అన్నారు. ప్రభుత్వ పథకాల తీరు నచ్చలేదని ... ఈ దేశం విడిచి వెళ్లిపోతామని సాధారణ ప్రజల్లో ఎవరైనా అంటే వారిని కూడా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంటారా? అని ఆమె ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్న ఒక సెలబ్రిటీ భార్య ఈ దేశం విడిచి వెళ్లాలనే తన ఆలోచనను భర్తకు చెప్పడం.. దురదృష్టం కొద్దీ ఆ విషయాన్ని ఆయన బయటకు చెప్పడం జరిగిందన్నారు. తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసే హక్కు ప్రతిపౌరుడికి ఉందన్నారు. లక్ష్యాన్ని మించి ఆమిర్ ఖాన్ పై విమర్శలు చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నారు. ఒకవేళ ఆమిర్ ఖాన్ పేరు అరుణ్ ఖన్నా అయినట్లయితే ఆయనపై ఇంతగా విమర్శలు వచ్చేవి కాదన్నారు. నంబర్ వన్ హీరో అయిన ఆమిర్ ఖాన్ కేవలం ఒకే ఒక్క రాత్రిలో నంబర్ వన్ విలన్ అయిపోయారంటూ శోభా డే అభిప్రాయపడ్డారు.