: తొలి రోజు ఆట...అశ్విన్, జడేజా చెరో వికెట్ పంచుకున్నారు
నాగ్ పూర్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య ప్రారంభమైన తొలి రోజు రెండు జట్లు ఆసక్తికరమైన ఆటతీరు ప్రదర్శించాయి. ఆటగాళ్ల ప్రదర్శనతో ఈ టెస్టు కూడా మూడు లేక నాలుగు రోజుల్లోనే ఫలితం తేలిపోయే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు సఫారీల బౌలింగ్ ధాటికి 215 పరుగులకే చాపచుట్టేయగా, బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా జట్టు కేవలం 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు అటను ఆసక్తికరంగా మార్చాలని భావించిన సఫారీ జట్టు కేవలం 9 ఓవర్లే ఆడాల్సి ఉండడంతో ఎల్గర్ (7), వాన్ జిల్ (0)లను దించింది. అశ్విన్ వేసిన అద్భుతమైన బంతిని వాన్ జిల్, రహానేకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో నైట్ వాచ్ మన్ గా ఉండేందుకు బౌలర్ ఇమ్రాన్ తాహిర్ (4) ను సఫారీలు బ్యాటింగ్ కు పంపారు. జడేజా వేసిన అద్భుతమైన బంతిని అర్థం చేసుకోలేకపోయిన తాహిర్ పెవిలియన్ చేరాడు. అనంతరం ఎల్గర్ కు ఆమ్లా జతకలిశాడు. దీంతో 9 ఓవర్లు ఆడిన సౌతాఫ్రికా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసి 204 పరుగులు వెనుకబడి ఉంది.