: కేజ్రీపై నోరు పారేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే!... సస్పెండైనా తీరు మారని వైనం
ఢిల్లీ శాసన సభ సభ్యుడిగా ఎన్నికైన బీజేపీ నేత ఓపీ శర్మ (విశ్వాస్ నగర్) ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై నోరు పారేసుకున్నారు. రాష్ట్రాన్ని ఎలా పాలించాలో తెలియని కేజ్రీ, రోజంతా అబద్ధాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అంతేకాక కేజ్రీవాల్ ఢిల్లీకి రావణుడిలా అవతరించారని కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆప్ మహిళా ఎమ్మెల్యే అల్కా లాంబాపై వ్యక్తిగత దూషణలకు దిగిన ఓపీ శర్మను స్పీకర్ రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కూడా తన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయన్న భావన ఆయనలో ఏమాత్రం కనిపించలేదు. లాంబాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చేప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సస్పెండైన తర్వాత శర్మ మీడియాతో మాట్లాడుతూ ‘‘కేజ్రీవాల్ ఢిల్లీకి రావణుడిలా దాపురించారు. రోజంతా అబద్ధాలతోనే కాలం గడుపుతున్నారు. రాష్ట్రాన్ని ఎలా పాలించాలో ఆయనకు తెలియదు. ప్రతి అంశాన్ని ఆయన పక్కదారి పట్టిస్తున్నారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.