: ఆమిర్ కు ములాయం మద్దతు!...అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని వ్యాఖ్య
దేశంలో కలకలం రేపిన మత అసహనం నేపథ్యంలో దేశం వదిలి వెళదామంటూ తన భార్య ప్రతిపాదించిందంటూ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమిర్ వ్యాఖ్యలతో బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఓ వర్గం ఆమిర్ కు మద్దతుగా నిలిస్తే, మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ నేతలు ఆమిర్ పై ఒంటికాలిపై లేచారు. అయితే కాస్తంత ఆలస్యంగా స్పందించినా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ బాలీవుడ్ స్టార్ కు మద్దతుగా నిలిచారు. దేశంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ములాయం వ్యాఖ్యానించారు. ‘‘ఆమిర్ వ్యాఖ్యలు కొంతమందిని బాధపెట్టి ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆమిర్ తో మాట్లాడాలి. అతడి వ్యాఖ్యల వెనుక ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. అయినా దేశంలో ఏ వ్యక్తికి అయినా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది’’ అని ములాయం కొద్దిసేపటి క్రితం లక్నోలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించారు.