: పొగ మంచే పేర్వారం మనవలను పొట్టనబెట్టుకుందా?...‘ఔటర్’ ప్రమాదంపై పోలీసుల ఆరా
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా సహా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలను పొగమంచు కప్పేస్తోంది. ఉదయం 9 గంటలకు కూడా పొగమంచు దుప్పటి వీడటం లేదు. హైదరాబాదు చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ఈ మంచు ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. రింగు రోడ్డుపై దట్టంగా ఆవరించి ఉన్న పొగమంచు కారణంగానే నేటి తెల్లవారుజామున కోకాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ముందుగా వెళుతున్న పాల వ్యాన్ ను వెనక నుంచి దూసుకువచ్చిన స్కోడా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పేర్వారం రాములు మనవలు వరుణ్, అమిత్ లు మృత్యువాత పడ్డారు. వీరితో పాటు కలిసి కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ప్రమాదం జరిగిన తీరుపై విశ్లేషిస్తున్నారు. తెల్లవారుజామున రింగు రోడ్డుపై దట్టంగా అలముకున్న పొగ మంచు కారణంగా కాస్తంత స్లోగా వెళుతున్న పాల వ్యాన్ ను గుర్తించలేకనే వీరు ప్రయాణిస్తున్న కారు దానిని ఢీకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.