: ఇక ‘యాప్ వాపసీ’... ఆమిర్ వ్యాఖ్యలతో స్నాప్ డీల్ పై నెటిజన్ల నిరసన
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో. దేశంలో పెచ్చరిల్లిన మత అసహనంపై బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెరతీశాయి. ఆమిర్ వ్యాఖ్యలపై గంటలు గడుస్తున్న కొద్దీ ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేని దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘స్నాప్ డీల్’ నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కారణమేంటంటే... ఆమిర్ ఖాన్ స్నాప్ డీల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుండటమే. ఆమిర్ వ్యాఖ్యలపై వేగంగా స్పందించిన నెటిజన్లు తమ మొబైల్ ఫోన్లలోని స్నాప్ డీప్ యాప్ ను వాపస్ చేయడంతో పాటు సదరు యాప్ రేటింగ్ ను బాగా తగ్గించేస్తున్నారు. ‘‘మీ బ్రాండ్ అంబాసిడర్ దేశ ద్రోహి. ఆ ద్రోహిని తొలగించేదాకా మీ యాప్ ద్వారానే కాక సైట్ ద్వారా కూడా వస్తువులు కొనుగోలు చేయం’’ అని నెటిజన్లు తెగేసి చెబుతున్నారు. ఆమిర్ వ్యాఖ్యలతో తమకేమీ సంబంధం లేదని స్నాప్ డీల్ ప్రకటించినా, నెటిజన్ల ఆగ్రహం చల్లారడం లేదు. దీనికి కౌంటర్ గా ఆమిర్ మద్దతుదారులు స్నాప్ డీల్ కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.