: చండీయాగానికి చంద్రబాబునూ పిలుస్తున్నాను: కేసీఆర్ ప్రకటన
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి సమయం సమీపిస్తోంది. వచ్చే నెల 23న మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎరవలిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న చండీయాగానికి సంబంధించి నిన్న కేసీఆర్ విస్పష్ట ప్రకటన చేశారు. యాగానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును కూడా ఆహ్వానిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ‘‘వచ్చే నెల 23న అయుత చండీయాగాన్ని నిర్వహిస్తున్నాను. నా సొంత ఖర్చులతోనే యాగం నిర్వహిస్తున్నాను. సీపీఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి యాగం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం తప్పు. నా సొంత ఖర్చుతో నిర్వహిస్తున్న యాగానికి కొంతమంది ఔత్సాహికులు కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్నారు. దీనికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎంను కూడా ఆహ్వానిస్తున్నాను’’ అని కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో నిన్న తెరాస భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.