: నేడు కార్తీక పౌర్ణమి... ఆలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ప్రధానంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. మరోవైపు గోదావరి, కృఫ్ణా నదీ తీరాల్లోని ప్రముఖ ఆలయాలు కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి, కృష్ణా నదీ తీరాలు భక్తుల పుణ్య స్నానాలతో రద్దీగా మారాయి. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణలోని శ్రీరాజరాజేశ్వరి, ధర్మపురి, యాదాద్రి, కాళేశ్వరం ఆలయాలకూ భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నేడు తిరుమల వెంకన్న సన్నిధిలో కార్తీక దీపోత్సవం జరగనుంది. ఈ కారణంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇదిలా ఉంటే, కార్తీక పౌర్ణమితో పాటు గురునానక్ జయంతిని కూడా పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నేడు సెలవు దినంగా ప్రకటించింది.