: శ్రీవారి ఆలయంపై వస్తున్న కథనాలు అవాస్తవం: జేఈఓ శ్రీనివాసరాజు
తిరుమలలో కురిసిన భారీ వర్షాల కారణంగా శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. తిరుమలలో భారీ వర్షాల కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసేశారంటూ సోషల్ మీడియాలో పలు అవాస్తవాలు హల్ చల్ చేస్తున్నాయన్నారు. ఇదంతా అబద్ధమని ఆయన తెలిపారు. రేపు శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, పౌర్ణమి గరుడ సేవ రద్దు చేసినట్లు తెలిపారు. తిరుమల రెండో ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగి పడిన కారణంగా వాహనాలకు అంతరాయం కల్గిందన్నారు. కొండచరియలను తొలగిస్తున్నామని, రెండ్రోజుల్లో ఈ ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలకు అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. తిరుమల వర్షపాతం వివరాలపై ఆయన మాట్లాడుతూ, ఈ నెలలో 1090 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఈ ఏడాదిలో అయితే ఇప్పటివరకు తిరుమలలో 1900 మి.మీ. వర్షపాతం నమోదైందని శ్రీనివాసరాజు పేర్కొన్నారు. కాగా, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా డిసెంబర్ 21, 22 తేదీల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉండవచ్చని ఈవో సాంబశివరావు పేర్కొన్నారు.