: చిత్తూరు మేయర్ దంపతుల హత్య ఇలా జరిగింది
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య నిందితులను కాసేపటి క్రితం పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా హత్య జరిగిన విధానాన్ని పోలీసులు తెలిపారు. ఈ హత్యలో 11 మంది నిందితులని అన్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతోందని, మరింత మందిపై అనుమానాలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. పోలీసు విచారణలో నిందితులు చెప్పిన వివరాలు...హత్యకు పథకం రచించిన తరువాత నిందితులు కారులో కార్పొరేషన్ భవనం వద్ద కెళ్లారు. బురఖాలు ధరించిన ముగ్గురు వ్యక్తులు ముందుగా లోపలికి వెళ్లారు. సమావేశ మందిరం బయట వెంకటేశ్, మంజునాథ్ కత్తులతో కాపలా కాయగా, తుపాకీ తీసుకుని చింటూ రాయల్ లోపలికి వెళ్లాడు. కుర్చీలో కూర్చున్న మేయర్ పై కాల్పులు జరిపాడు. తొలి తుపాకీ గుండు సరిగా తగలకపోవడంతో, మరోసారి సూటిగా తలలో కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడ కుప్పకూలింది. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిద్దామని వచ్చిన ఆమె భర్త తుపాకీ కాల్పులకు భయపడి బయటకు పరుగెత్తాడు. అతనిపై కాల్పులు జరుపుకుంటూ చింటూ సమావేశ మందిరం నుంచి హాల్ లోకి వచ్చాడు. అప్పటికే తుపాకీ గుండు తగలడంతో మోహన్ నేల కూలబడగా, సహచరుల చేతుల్లోని కత్తి తీసుకుని చింటూ రాయల్ అతనిపై దాడికి దిగాడు. అతను బతికే అవకాశం లేదని తేలిన తరువాత కార్పోరేషన్ భవనం వెనుక గోడదూకి సిద్ధంగా ఉన్న కారులో పారిపోయారు. అనంతరం దర్యాప్తు వేగవంతం కావడంతో నిందితులు వెంకటేశ్, మంజునాథ్ తదితర 11 మంది నిందితులు లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని, పూర్తి విచారణ తరువాత మిగిలిన నిందితులను అరెస్టు చేస్తామని ఆయన చెప్పారు.