: ఎనిమిది గంటల నిద్రతో మరింత జ్ఞాపకశక్తి !
జ్ఞాపకశక్తి పెరగడానికి, నిద్రకు సంబంధం ఉందన్న విషయం పరిశోధకుల కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ఎనిమిది గంటల పాటు నిద్ర పోయిన వారిలో జ్ఞాపకశక్తి మరింత బాగుంటుందని ఆ అధ్యయనం తేల్చింది. అమెరికాకు చెందిన బ్రిగామ్ అండ్ ఉమెన్ ఆసుపత్రిలో ఈ అంశంపై అధ్యయనం చేసినట్లు జెన్.ఎఫ్.డఫీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఔత్సాహికులను రాత్రి సమయంలో సరిపడా నిద్రపొమ్మన్నారు. ఆ తర్వాత వారికి ఒక పరీక్ష పెట్టారు. అదేమిటంటే... సుమారు 20 మంది వ్యక్తుల కలర్ ఫొటోలను, వారి పేర్లను వారికి చూపించారు. వాటన్నింటిని బాగా గుర్తుంచుకోమని చెప్పారు. 12 గంటల తర్వాత, అంతకుముందు చూపించిన ఒక్కొక్క ఫొటో చూపించి.. వారి పేరేమిటని ఆయా ఔత్సాహికులను ప్రశ్నించారు. సమాధానాల మేరకు వారి కాన్ఫిడెన్స్ లెవెల్ ను ఒక స్కేల్ ద్వారా గుర్తించారు. ఈ స్కేల్ లో 1 నుంచి 9 వరకు పాయింట్లు ఉన్నాయి. అయితే, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ రెండుసార్లు పరీక్ష నిర్వహించారు. ఎనిమిది గంటలపాటు చక్కగా నిద్రపోనిచ్చి ఒకసారి, మధ్య మధ్యలో అంతరాయం కల్గిస్తూ మరోసారి నిద్ర పోనిచ్చారు. ఎనిమిది గంటలు పాటు నిద్రించిన వారిలో 12 శాతం మంది కరెక్టు సమాధానాలు చెప్పగలిగారు. సరిపడా నిద్రించిన తర్వాత నేర్చుకునే కొత్త విషయాల ద్వారా మెరుగైన జ్ఞాపకశక్తిని పొందవచ్చని డఫీ పేర్కొన్నారు.