: వరంగల్ లో గెలిచిన పసునూరి దయాకర్ నేపథ్యం ఇదే!


వరంగల్ ఉప ఎన్నికలో పసునూరి దయాకర్ భారీ మెజార్టీతో గెలుపొందడం ప్రతిపక్షాలను విస్మయానికి గురిచేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థే విజయం సాధిస్తాడనుకున్నా, అన్ని లక్షల ఓట్లు పడతాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. అలాగని పోటీ చేసిన వ్యక్తి సీనియర్ నేత కూడా కాదు. అయితే, అతను మొదటి నుంచి పక్కా తెలంగాణ వాది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీలో పలు రూపాల్లో పని చేశారు. ఆగస్టు 2, 1967లో జన్మించిన పసునూరి స్వస్థలం వరంగల్ జిల్లా సంగెం మండలం, బొల్లికుంట. తల్లిదండ్రులు ప్రకాశం, కమలమ్మ. భార్య జయవాణి, పిల్లలు రోణి భరత, ప్రీతమ్ భరత. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దయాకర్ తొలుత ఫోటోగ్రాఫర్ గా జీవితం సాగించి అంచెలంచెలుగా ఎదిగారు. హైదరాబాద్ జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ చదివారు. తరువాత తెలంగాణ తల్లి శిల్పాలను రూపొందించిన వారిలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఇలా వివిధ హోదాల్లో దయాకర్ పని చేశారు. 2011 నుంచి 2013 వరకు వర్ధన్నపేట నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో వర్ధన్నపేట టిక్కెట్ ఆశించినప్పటికీ అదృష్టం వరించలేదు. దాంతో ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది వరంగల్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ తరపున ఎంపీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో పోటీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు స్థానికులు కాకపోవడం, పసునూరి ఆ నియోజకవర్గ స్థానిక వ్యక్తి అన్న అంశం బాగా కలసి వచ్చింది.

  • Loading...

More Telugu News