: ‘ఉగ్ర’ సమాచారం కోసం ‘వాట్సప్’ను వాడుకుంటున్న టెర్రరిస్టులు?
సమాచారాన్ని అతితక్కువ సమయంలో ప్రపంచంలో ఏమూలకైనా సరే చేరవేసేందుకు మొబైల్ ఆధారిత యాప్ లు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎన్ క్రిప్టెడ్ యాప్స్ ఉన్నవి వాట్సప్, వైబర్. సాధారణ ప్రజలకు ఈ యాప్స్ ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు. కానీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, నిఘా సంస్థలకు మాత్రం పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకంటే, ఉగ్రవాదులు తమ సమాచారాన్ని చేరవేసుకునేందుకు వీటిని కొత్తగా వినియోగిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా వాట్సప్ ద్వారా చేరవేసే సమాచారం ఎన్ క్రిప్ట్ అవడంతో అందులో ఏమున్నదన్న విషయం ‘రిసీవర్’కు తప్పా మిగిలిన వారెవ్వరికీ తెలియదు. అందుకే ‘ఉగ్ర’ సమాచారాన్ని చేరవేసేందుకు ఈ యాప్ తమకు సురక్షితమని భావిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా పంపే సమాచారం గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేమికాదు. ఎందుకంటే, అది టెక్స్ట్ రూపంలో ఉంటుంది కనుక. ఎన్ క్రిప్టెడ్ మెస్సేజ్ ల గురించి తెలుసుకోవాలంటే సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లు అందించే సాఫ్ట్ వేర్ ఉండాలి. అయినప్పటికీ అది చాలా కష్టమైన పని అని సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు, తెలంగాణ పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉగ్రవాదులు తమ సమాచారం ఎవ్వరికీ తెలియకుండా ఉండేలా కమ్యూనికేషన్ లైన్ ఒక దానిని ఏర్పాటు చేసుకుంటారన్నారు. ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ పద్ధతిని వాట్సప్ గత ఏడాది ప్రవేశపెట్టింది. అంతకుముందున్న విధానంలో అయితే చాలా తేలికగా నిందితులను పట్టుకునే అవకాశముండేది. కానీ, ఈ కొత్త పద్ధతి కారణంగా తెలుసుకోవడం చాలా కష్టమన్నారు. అయితే, ఈ మార్గంలో కూడా ఏదో ఒక లూప్ హోల్ ఉంటుందని దానిని కనుగొంటే ‘ఉగ్ర’ సమాచారాన్ని తెలుసుకునే అవకాశాలుంటాయన్నారు.