: రష్యా యుద్ధ విమానాన్ని పేల్చేసిన టర్కీ... పట్టుబడిన ఒక పైలెట్
రష్యాకు చెందిన సుకోయ్ విమానం ఎస్ యూ-24ను టర్కీ సైన్యం ఎఫ్-16 యుద్ధ విమానంతో సిరియా సరిహద్దులో కూల్చివేసింది. ఆ సమయంలో విమానం కూలిపోవడానికి ముందే అందులో ఉన్న ఇద్దరు పైలెట్లూ పారాచూట్ల సాయంతో దూకేయగా, వారిలో ఒకరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పట్టుబడినట్టు టర్కీ మీడియా తెలిపింది. కాగా విమానం కూల్చివేత విషయాన్ని టర్కీ సైన్యం ధ్రువీకరించింది. అనుమతి లేకుండా సిరియా సరిహద్దు మీదుగా తుర్కామెన్ పర్వతం సమీపానికి రాగానే విమానాన్ని పేల్చి వేసినట్టు తెలిపింది. ఈ సమయంలో విమానం నుంచి ఓ ఫైర్ బాల్ కూడా పర్వతంపై పడినట్టు వెల్లడించింది. ఈ ఘటనపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని హెచ్చరించింది.