: విపక్షాలకు షాకిచ్చిన ‘ఓరుగల్లు’ ఓటర్లు!... ప్రతిపక్షాల డిపాజిట్లు సైతం గల్లంతు
ప్రభుత్వ వ్యతిరేకతే తమ బలమని బల్లగుద్ది మరీ చెప్పిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ప్రజలు షాకిచ్చారు. ఈ నెల 21 న జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం పూర్తైంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. అదే సమయంలో ఆయా పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్లను కూడా అధికారులు వెల్లడించారు. టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తారని భావించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ డిపాజిట్ గల్లంతైంది. మొత్తం 15 లక్షలకు పైగా ఓట్లున్న వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉప ఎన్నికలో 10 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి ఏకంగా 6,15,407 ఓట్లను కొల్టగొట్టారు. ఇక ఈ ఎన్నికలో డిపాజిట్ దక్కించుకోవాలంటే 1.74 లక్షల ఓట్లు రావాల్సి ఉంది. అయితే ప్రతిపక్ష అభ్యర్థి ఏ ఒక్కరు కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ 1,56,315 ఓట్లు సాధించగా, ఎన్డీఏ అభ్యర్థి దేవయ్య 1,30,178 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ రావుకు 23,325 ఓట్లు పడగా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన భాస్కర్ కు 28,540 ఓట్లు పడ్డాయి. అంటే, భాస్కర్ వైసీపీ అభ్యర్థి కంటే కూడా అధికంగా ఓట్లు సాధించగలిగారు. వెరసి విపక్షాలకు చెందిన ఏ ఒక్కరికి ఈ ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదు.