: డిపాజిట్లు రానోళ్లూ...సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు: వరంగల్ ఫలితంపై తలసాని కామెంట్
వరంగల్ ఉప ఎన్నికల్లో దాదాపుగా విజయం ఖరారవడంతో టీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మొత్తం ఓట్లలో దాదాపుగా 4 లక్షల ఓట్ల దాకా చేజిక్కించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం ఖరారైపోయింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. వరంగల్ లోనే కాక హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయం తెరాస భవన్ వద్ద కూడా సంబరాలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ చానెల్ తో మాట్లాడిన సందర్భంగా తెరాస నేత, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాలపై ఒంటికాలిపై లేచారు. డిపాజిట్లు రాని నేతలు కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతున్నామని తెలిసి కూడా విపక్షాలకు చెందిన కొంతమంది నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాధ్యత లేకుండా నోరు పారేసుకునే నేతల నాలుకలు చీల్చేస్తామన్న రీతిలో ప్రజలిచ్చిన ఈ తీర్పు విపక్ష నేతలకు గుణపాఠమేనని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకుని పరిధి దాటకుండా వ్యవహరిస్తే మంచిదని కూడా ఆయన హెచ్చరించారు.