: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేయడానికి హైకోర్టు నిరాకరణ
ఐఏఎస్ అధికారిణి, తెలంగాణ సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ కు 'ఔట్ లుక్' మ్యాగజైన్ కథనం వివాదంలో నోటీసులు జారీ చేయడానికి ఉమ్మడి హైకోర్టు తిరస్కరించింది. ప్రస్తుత దశలో ఆమెకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసులు జారీ చేయాల్సిన సమయం వచ్చిందని తాము అనుకుంటే అప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. ఔట్ లుక్ వ్యవహారంలో న్యాయపరమైన ఖర్చుల కోసం స్మితాకు ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేయడంపై వేసిన వ్యాజాలపై ఈ మేరకు వాదనలు జరిగాయి. ప్రజా ధనాన్ని ఈ విధంగా ఖర్చు చేయడం సరికాదని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు. దాంతో ధర్మాసనం విభేదించింది. ఐఏఎస్ ల ప్రతిష్టే ప్రభుత్వ ప్రతిష్టని చెప్పింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.