: జంట నగరాల్లో అణువణువూ జల్లెడ పడుతున్న పోలీసులు!
దేశంలోని పలు నగరాలతో పాటు హైదరాబాద్ కూడా ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉందని, నగరంపై దాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హై అలర్ట్ ప్రకటించడంతో, పోలీసులు అణువణువూ సోదాలు జరుపుతున్నారు. గత రాత్రి పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పలు జోన్ల పోలీసులు, ఈ ఉదయం కూడా వివిధ కూడళ్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన 100 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సరైన పత్రాలు లేని 88 బైకులు, 50 వరకూ కార్లు, ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు.