: లంకలోనే భారత్-పాక్ సిరీస్!... అంగీకారానికి వచ్చిన బీసీసీఐ, పీసీబీ


సుదీర్ఘకాలంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్-పాక్ క్రికెట్ సిరీస్ పై ఎట్టకేలకు అనిశ్చితి తొలగిపోయింది. శ్రీలంక వేదికగా ఈ సిరీస్ నిర్వహణకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దాదాపుగా ఓ అంగీకారానికి వచ్చాయి. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఈ నెల 27న వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా ద్వైపాక్షిక సిరీస్ లు జరపాలని ఇరు బోర్డుల మధ్య గతేడాది ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ లకు వేదికగా యూఏఈని ఎంచుకుందామన్న పీసీబీ ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించలేదు. అదే సమయంలో భారత్ లో సిరీస్ నిర్వహిద్దామన్న బీసీసీఐ ప్రతిపాదనకు పీసీబీ కూడా సమ్మతించలేదు. దీంతో ఇరు బోర్డుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. మొన్న, నిన్న దుబాయిలో బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్, పీసీబీ అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ ల మధ్య విడతలవారీగా జరిగిన చర్చల్లో శ్రీలంక వేదికగా సిరీస్ నిర్వహణకు ఇరు బోర్డులు దాదాపుగా అంగీకరించాయి. అయితే ముందుగా అనుకున్న ప్రకారం రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ20లు కాకుండా... కేవలం మూడు వన్డేలు, రెండు టీ20లతోనే సిరీస్ ను నిర్వహించేందుకు ఇరు బోర్డుల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News