: ‘అసహనం’ భయపెట్టింది... దేశం వదిలిపోదామని నా భార్య చెప్పింది: ఆమిర్ ఖాన్ వ్యాఖ్య
దేశంలో పెచ్చరిల్లిన మత అసహనంపై నిరసన గళమెత్తిన రచయితలకు బాలీవుడ్ ప్రముఖ నటుడు, మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ వాయిస్ కూడా తోడైంది. నిన్న దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన రామ్ నాథ్ గోయెంకా మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆమిర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మత అసహనం తన కుటుంబాన్ని భయపెట్టిందని అతడు పేర్కొన్నాడు. దీనిపై భీతిల్లిన తన భార్య కిరణ్ రావు దేశాన్ని వదిలి ఎక్కడికైనా వెళదామంటూ ప్రతిపాదించిందని కూడా అతడు చెప్పాడు. వరుసగా జరుగుతున్న ఘటనలతో తమ కొడుకు గురించి కిరణ్ రావు భయపడుతోందని చెప్పాడు. దేశ పౌరులుగా దేశంలో జరిగే ప్రతి విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకుంటున్నామని, ఈ ఘటనలే తమలో భయాందోళనలకు కారణమయ్యాయని కూడా అతడు పేర్కొన్నాడు. దాద్రి ఘటన ముమ్మాటికీ హింసేనని కూడా ఆమిర్ కుండ బద్దలు కొట్టాడు. ఈ ఘటనలపై నిరసన వ్యక్తం చేస్తూ రచయితలు అవార్డులను వెనక్కివ్వడాన్ని కూడా అతడు సమర్థించాడు. ఈ సందర్భంగా రాజకీయ నేతల తీరుపైనా అతడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఐదేళ్ల కాలానికి ఎన్నుకున్నామని, పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత వీరిపైనే ఉందని కూడా ఆమిర్ వ్యాఖ్యానించాడు.