: ‘ఓరుగల్లు’ ఎవరిదో?... నేడే బైపోల్స్ రిజల్ట్స్!
అటు తెలంగాణను తెచ్చామంటున్న అధికార టీఆర్ఎస్... ఇటు తెలంగాణను ఇచ్చామంటున్న విపక్ష కాంగ్రెస్... రెండు పార్టీలు హోరాహోరీగా తలపడిన వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ నెల 21న జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. 11 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితం విడుదల కానుంది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్న వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 15 లక్షలకు పైగా ఓటర్లున్నారు. మొన్నటి పోలింగులో 69.01 శాతం దాకా ఓటింగ్ నమోదైంది. ఎస్సీ రిజర్వ్ డ్ స్థానంగా ఉన్న ఈ స్థానంలో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఎంపీగా గెలిచారు. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ కారణంగా వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక తప్పలేదు. టీఆర్ఎస్ తరఫున రాజకీయాలకు కొత్త అభ్యర్థి అయిన పసునూరి దయాకర్ బరిలోకి దిగగా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పోటీ చేశారు. ఎన్డీఏ తరఫున అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ దాదాపు పసునూరి, సర్వేల మధ్యే ప్రధాన పోరు నెలకొంది. ఓటింగ్ శాతాన్ని విశ్లేషించుకున్న తర్వాత గెలుపు తమదంటే, కాదు తమదని ఇరు పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇక కౌంటింగ్ విషయానికి వస్తే ఇప్పటికే వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నిక హోరాహోరీగా సాగిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగే కౌంటింగ్ కు ఆయా పార్టీల తరఫున ఏజెంట్లకు ఇప్పటికే పాసులు జారీ చేశామని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు.