: తాను సమిధనై వందల మందికి వెలుగునిచ్చాడు
ఈ నెల 13న పారిస్ దాడులు జరిగిన రోజే లెబనాన్ రాజధాని బీరూట్ లోని ఓ ప్రార్థనా మందిరంపై తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆత్మాహుతి దళ సభ్యుడు ప్రార్థనా మందిరం బయట తనను తాను పేల్చుకుని వందల మందిని బలిగొన్నాడు. అనంతరం సంఘటనా స్థలికి పలువురు ప్రజలు, పోలీసులు, వైద్య సిబ్బంది, సహాయక సిబ్బంది చేరుకుని మృత దేహాల తొలగింపు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదే సమయంలో బిగ్గరగా కేకలు వేస్తూ ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ అక్కడకు రావడాన్ని అదెల్ టెర్మోస్ (32) అనే వ్యక్తి గమనించాడు. అతను కచ్చితంగా ఆత్మాహుతి దళ సభ్యుడే అని భావించాడు. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయలేదు. కర్తవ్యం గుర్తుకు వచ్చిన సైనికుడిలా ముందుకు పరుగెత్తి, పరుగున వస్తున్న వ్యక్తిని ఒడిసి పట్టుకున్నాడు. అంతే, వందలాది మంది చూస్తుండగా, వారికి కూత వేటు దూరంలో భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. ఉగ్రవాదితో పాటు అదెల్ టెర్మోస్ కూడా ఆనవాళ్లు లేకుండా పేలిపోయాడు. టెర్మోస్ ఆ పని చేసుండకపోతే ఎంత మంది అనాధలుగా మారి ఉండే వారో ఊహించుకుంటేనే బాధేస్తుందని అక్కడున్నవారు పేర్కొన్నారు. టెర్మోస్ అంత్య క్రియల్లో వేలాది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా టెర్మోస్ భార్య మాట్లాడుతూ, తన భర్త చేసిన పనికి గర్విస్తున్నామని, అతను లేకున్నా ఆయన త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు.