: కమల్-శ్రీదేవి సూపర్ హిట్ ‘సద్మా’ను రీమేక్ చేస్తా: యాడ్ ఫిల్మ్ మేకర్ బాప్టిస్టా


1982లో దర్శకుడు బాలూమహేంద్ర దర్శకత్వంలో వచ్చిన కళాత్మక తమిళ చిత్రం 'మూండ్రం పిరాయి'. కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. అదే చిత్రాన్ని తెలుగులో ‘వసంతకోకిల’గా డబ్ చేయగా, హిందీలో ‘సద్మా’గా రీమేక్ చేశారు. అప్పట్లో ఈ చిత్రం అన్ని భాషలలోను రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేస్తానంటున్నాడు యాడ్ ఫిల్మ్ మేకర్ లాయిడ్ బాప్టిస్టా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "సద్మా చాలా అద్భుతమైన చిత్రం. యంగ్ బాయ్ గా ఉన్నప్పుడు నేను ఈ సినిమా చూశాను. ఈ చిత్రంలో చివరి సీన్ నా కళ్ల ముందు కదులుతూ ఉంటుంది. ప్రేమపై నమ్మకంలేని ఈ తరం వాళ్లు ఇటువంటి చిత్రాలను తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది" అని బాప్టిస్టా పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన తెలిపారు. ఈ సినిమాలో కమల్ హాసన్, శ్రీదేవి పోషించిన పాత్రలను వేరే నటులు పోషించడం అంత తేలికైన విషయం కాదన్నారు. అందుకుగాను ఎ-లిస్ట్ నటులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ‘సద్మా’ చిత్రం సారాంశాన్ని పాడు చేయకుండా, ప్రేక్షకులకు విసుగు పుట్టించకుండా ఉండేలా రీమేక్ చేసేందుకు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నానన్నారు. ఈ నేపథ్యంలో సద్మా చిత్రం హక్కులను దర్శక, నిర్మాత రాజ్ సిప్పీ నుంచి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ చిత్రం రీమేక్ ను హిందీ, తమిళ్ తో పాటు ఇంగ్లీషు భాషలో కూడా తీస్తానన్నారు. కాగా, 'మూండ్రం పిరాయి' చిత్రంలో ‘కమల్’ నటనకుగాను కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుతో ఆయన్ని గౌరవించింది.

  • Loading...

More Telugu News