: విమానానికి రాకెట్ ఇంజిన్.. ఇక స్పీడే స్పీడు!
విమానానికి రాకెట్ ఇంజిన్ ను అమరిస్తే? ఆ వేగం ఎంత? దానిని నియంత్రించడం సాధ్యమా? వంటి ఎన్నో ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. కాంకర్డ్ విమానానికి ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే విమానాన్ని తయారు చేసేందుకు కెనడా శాస్త్రవేత్తలు చార్లెస్ బంబార్డియర్, రే మాట్టిసన్ లు స్కీమర్ పేరుతో అత్యంత వేగవంతమైన విమానాన్ని తయారు చేయడానికి నడుం బిగించారు. వారు డిజైన్ చేసిన విమానం కేవలం 40 నిమిషాల్లో అట్లాంటిక్ సముద్రాన్ని దాటేస్తుందని చెబుతున్నారు. కాంకర్డ్ విమానాలు మూడున్నర గంటల్లో దాటుతున్నా ఈ దూరాన్ని భారీ జెట్ విమానాలు ఐదు నుంచి ఆరు గంటల్లో అధిగమించగలుగుతున్నాయి ( ఇదే దూరాన్ని అధిగమించేందుకు 1927లో 33 గంటల 30 నిమిషాలు పట్టేది). ఈ నూతన ఆవిష్కరణలో రాకెట్లు, రాకెట్ మోటార్లు, విద్యుదయస్కాతం సాంకేతికను వినియోగించారు. దీనిలో మొత్తం నాలుగు రెక్కలు, రెండు రాకెట్లుంటాయి. ఇది మాక్ 10 వేగాన్ని సునాయాసంగా అందుకుంటుంది. 75 మంది సౌకర్యవంతంగా ప్రయాణించగలిగే ఈ విమానంలో ఉదయం అమెరికాలో టిఫిన్ చేసి, మధ్యాహ్నం భోజనం భారత్ లోని ఇంట్లో చేయవచ్చు. మాగ్నటిక్ కాయిల్స్ సాయంతో దీని అంతర్గత వ్యవస్థకు విద్యుత్ అందిస్తారు. ఇది కాంకర్డ్ విమానానికి ఐదు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని వారు చెబుతున్నారు.