: దిగ్గజాలు నష్టపోగా, ఎగిరి దుమికిన చోటా కంపెనీలు!
లార్జ్ కాప్ కంపెనీలు లాభాలను నమోదు చేయడంలో విఫలమైన వేళ, చిన్న, మధ్య తరహా కంపెనీలు సత్తాను చాటాయి. ఎన్ఎస్ఈ-50లో సగానికన్నా ఎక్కువ కంపెనీలు నష్టపోగా, స్మాల్, మిడ్ కాప్ లోని 70 శాతం కంపెనీలు ఎంతో కొంత లాభాన్ని నమోదు చేశాయి. భారత కాలమానం ప్రకారం, మధ్యాహ్నం తరువాత ప్రారంభమైన యూరప్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత స్థితి కారణంగా సెన్సెక్స్, నిఫ్టీల అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయని మార్కెట్ పండితులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు నవంబర్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సెషన్ కు ముగింపు మరో రెండు రోజుల వ్యవధి ఉండటం కూడా ఇన్వెస్టర్లను కొత్తగా ఈక్విటీల కొనుగోలు దిశగా ప్రేరేపించలేదని అంచనా వేశారు. సోమవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 49.15 పాయింట్లు పడిపోయి 0.19 శాతం నష్టంతో 25,819.34 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 7.30 పాయింట్లు పడిపోయి 0.09 శాతం నష్టంతో 7,849.25 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.36 శాతం, స్మాల్ క్యాప్ 0.46 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 22 కంపెనీలు లాభాల్లో నడిచాయి. గెయిల్, టాటా మోటార్స్, ఆసియన్ పెయింట్స్, జడ్ఈఈఎల్, ఐడియా తదితర కంపెనీలు లాభపడగా, హిందాల్కో, వీఈడీఎల్, టాటా స్టీల్, ఐటీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 97,98,014 కోట్లకు పెరిగింది. మొత్తం 2,842 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,484 కంపెనీలు లాభాలను, 1,180 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.