: అభివృద్ధిలో మాకు చైనా స్ఫూర్తి: సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చైనా మంత్రి చెంగ్ ఫెంజియాంగ్ సమావేశమయ్యారు. ఫెంజియాంగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా రాజధాని నిర్మాణం, పెట్టుబడులు, తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అభివృద్ధిలో తమకు చైనా స్ఫూర్తి అని అన్నారు. పెట్టుబడులకు షాంఘై తర్వాత అమరావతిని రెండో ప్రాధాన్యంగా గుర్తించాలని ఆయన కోరారు. అనంతరం చైనా మంత్రి మాట్లాడుతూ, చంద్రబాబు చైనాలో పర్యటన అనంతరం సంబంధాలు మెరుగుపడ్డాయని అన్నారు. అమరావతి నిర్మాణంలో మరిన్ని చైనా సంస్థలకు అవకాశాలు కల్పిస్తామని, చంద్రబాబు నాయకత్వంలో రాజధాని నిర్మాణం సాకారమవుతుందని ఫెంజియాంగ్ పేర్కొన్నారు.