: పోలీసులకు ఫిర్యాదు చేసే యోచన లేదు!...ర్యాగింగ్ పై నాగార్జున వర్సిటీ అధికారుల ప్రకటన


నాగార్జున యూనివర్శిటీలో ఆమధ్య బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగుకు బలై ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. ఆ తర్వాత ర్యాగింగుకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, అదే కళాశాలలో నిన్న మరోమారు ర్యాగింగ్ కలకలం చోటుచేసుకుంది. జూనియర్ విద్యార్థుల ఫిర్యాదులతో కాస్తంత వేగంగా స్పందించిన వర్సిటీ అధికారులు ర్యాగింగ్ కు పాల్పడ్డ ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి గంటా షాక్ కు గురయ్యారు. ర్యాగింగ్ దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ఆయన ఫోన్ లో వర్సిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, నిన్న వెలుగుచూసిన ర్యాగింగ్ చిన్న ఘటననేనని కొద్దిసేపటి క్రితం వర్సిటీ అధికారులు ప్రకటించారు. అంతేకాక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనేది లేదని కూడా వారు తేల్చిచెప్పారు. ఓ పక్క ర్యాగింగ్ రక్కసికి అభంశుభం తేలియని విద్యార్థులు బలైపోతుంటే, సదరు ఘటనలు చిన్నదేనంటూ వర్సిటీ అధికారులు ప్రకటించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి నాగార్జున వర్సిటీ అధికారుల వివాదాస్పద ప్రకటనపై మంత్రి గంటా ఎలా స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News