: టాటాలను దెబ్బకొట్టిన మహీంద్రా!
ఇండియాలో అత్యధిక వాహనాలను విక్రయిస్తున్న రెండవ అతిపెద్ద సంస్థ టాటా మోటార్స్ ను మహీంద్రా అండ్ మహీంద్రా దెబ్బకొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల పరిధిలో ఎల్సీవీ (లైట్ కమర్షియల్ సెగ్మెంట్) విభాగంలో ఎంఅండ్ఎం మార్కెట్ షేర్ ఏకంగా 60 శాతానికి పెరిగింది. ఈ క్రమంలో ఎంఅండ్ఎం విక్రయిస్తున్న ఎల్సీవీ సెగ్మెంట్ అమ్మకాల వృద్ధి టాటా మోటార్స్ ను దాటింది. దేశవ్యాప్తంగా ఈ విభాగంలో వాహనాల అమ్మకాలు తగ్గినప్పటికీ, మహీంద్రా విక్రయాలు గణనీయంగా మెరుగుపడటం గమనార్హం. ఇటీవల 'జీతో'ను మార్కెట్లోకి విడుదల చేసిన తరువాత తమ వాటా మరింతగా పెరిగిందని సంస్థ ఆటోమోటివ్ విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా వ్యాఖ్యానించారు. 2 టన్నుల ఎల్సీవీ సెగ్మెంట్ లో ఎంఅండ్ఎం మార్కెట్ వాటా 12 నుంచి 25 శాతానికి పెరిగిందని వివరించారు. కాగా, ఈ విభాగంలో 2013-14లో 38 శాతం మార్కెట్ వాటాను అనుభవించిన టాటా మోటార్స్, ఇప్పుడు 37 శాతానికి పరిమితమైనట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.