: అగ్రిగోల్డ్ బినామీ ఆస్తుల మాటేమిటి?... పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన లక్షలాది మంది మధ్యతరగతి జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో కొద్దిసేపటి క్రితం విచారణ జరిగింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఆసక్తికర వాదనను ప్రస్తావించారు. డిపాజిటర్ల సొమ్మును తిరిగి చెల్లించే బాధ్యతను కోర్టు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన న్యాయవాది, బాధితుల సొమ్ముతో అగ్రిగోల్డ్ యాజమాన్యం బినామీ పేర్లపై కొనుగోలు చేసిన ఆస్తుల మాటేమిటని ప్రశ్నించారు. బాధితుల సొమ్ముతో కొనుగోలు చేసిన బినామీ ఆస్తులు కూడా డిపాజిటర్లకే చెందాలన్న కోణంలో ఆయన చేసిన వాదనపై హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. బినామీ ఆస్తులపై గురువారం జరగనున్న తదుపరి విచారణలో దృష్టి సారించనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.