: ఏఎస్సైపై ఆప్ మహిళా ఎమ్మెల్యే తిట్ల దండకం!... సోషల్ మీడియాలో వీడియో హల్ చల్
దేశ రాజకీయాల్లో పెను సంచలనాలను నమోదు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతోంది. ఇప్పటికే సోమ్ నాథ్ భారతి వ్యవహారంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మంటగలిసింది. తాజాగా ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఢిల్లీ నడి వీధుల్లో ఓ పోలీసు అధికారిపై తిట్ల దండకం అందుకున్నారు. కారుతో సదరు పోలీసు అధికారిని ఢీకొట్టడమే కాక ఆయనపైనే నోరుపారేసుకున్న సదరు ఎమ్మెల్యేపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే... నిన్న ఢిల్లీ వీధుల్లోకి వచ్చిన ఆప్ ఎమ్మెల్యే సరితా సింగ్ కారు బైకుపై ముందుగా వెళుతున్న ఏఎస్సై ఓమ్ పాల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డ ఓమ్ పాల్ ఎమ్మెల్యే సరితా సింగ్ కారు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. వెంటనే కారు దిగిన సరితా సింగ్ ఏఎస్సైపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. కారుతో తన బైకును ఢీకొట్టడమే కాక తనపైనే తిట్ల దండకం అందుకున్న సరితా సింగ్ పై ఓమ్ పాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.