: సీఎం చంద్రబాబుతో చైనా ప్రతినిధుల బృందం భేటీ
విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో చైనా ప్రతినిధుల బృందం భేటీ అయింది. చైనా విదేశాంగ శాఖ ఉపమంత్రి చెంగ్ ఫెంజియాంగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం సమావేశమైంది. రాజధాని నిర్మాణం, పెట్టుబడులు, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. రాజధాని నగర నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు చైనా ఆసక్తి చూపుతోంది. పలుమార్లు చంద్రబాబు బృందం చైనా సందర్శనకు వెళ్లినప్పుడు తమ కంపెనీలతో పెట్టుబడులు పెట్టిస్తామని ఆ దేశ మంత్రులు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగ ఉపమంత్రి బృందం అమరావతి రావడంతో ప్రభుత్వం, ఇటు రాజధాని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అంతకుముందు విజయవాడ చేరుకున్న వారు గేట్ వే హోటల్ లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో భేటీ అయి అవే అంశాలపై మాట్లాడారు. కాగా సీఎంతో సమావేశం తరువాత వారంతా అమరావతిలో పర్యటించనున్నారు.