: కీళ్ల నొప్పులతో బాధపడేవారికి శుభవార్త... కేంద్రం నిర్ణయంతో 50 శాతం వరకూ తగ్గిన ఇంప్లాంట్స్ ధరలు
కీళ్ల నొప్పులతో బాధపడుతూ, ఇంప్లాంట్స్ శస్త్రచికిత్సలు చేయించుకోవాలని భావిస్తున్న వారికి శుభవార్త. ఇంప్లాంట్స్ ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. దీంతో వివిధ రకాల ఇంప్లాంట్స్ ధరలు 40 నుంచి 50 శాతానికి పైగా తగ్గినట్లయింది. వాస్తవానికి మోకాలి నొప్పులతో బాధపడుతున్న వారిలో 80 శాతం మందికి సర్జరీలు అవసరపడతాయి. వీరిలో అరిగిపోయిన కీళ్ల స్థానంలో కృత్రిమ కీళ్లను అమర్చుతారు. ఈ తరహా ఆపరేషన్లలో కీళ్ల మార్పిడికి ప్రస్తుతం రూ. 70 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకూ ఖర్చవుతోంది. వైద్య ఉపకరణాలను మరింత మందికి అందుబాటులోకి తేవాలంటూ, నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంప్లాంట్స్ ధరలు నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అధారిటీ నియంత్రణలో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ వర్గాల వివరాల ప్రకాం, హిప్ ఇంప్లాంటుకు రూ. 86 వేలు (అన్ సిమెంటెడ్), రూ. 45 వేలు (సిమెంటెడ్), మోకాలి ఇంప్లాంట్ కు రూ. 97 వేలు (అన్ సిమెంటెడ్), రూ. 54 వేలు (సిమెంటెడ్) ధర మించరాదని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ధరలపై ఆపరేషన్ చేస్తే, ఇతర ఖర్చులు కలుపుకుని రూ. 70 వేల నుంచి రూ. 1.15 లక్షల వరకూ ఖర్చవుతుంది. కాగా, బాధితుల సౌలభ్యం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి వుందని ఆర్థోపెడిక్ సర్జన్లు సలహా ఇస్తున్నారు. ధరలు ఇంకా తగ్గి వచ్చేందుకు వీలుందని వారు వెల్లడించారు.