: వేతన సవరణపై ఐఏఎస్ ల గుర్రు... కేంద్రానికి 200 మంది సీనియర్ల లేఖాస్త్రాలు


ఉద్యోగుల వేతనాల సవరణ కోసం నియమించిన ఏడో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం, ఐఏఎస్ అధికారుల మధ్య చిచ్చు పెట్టేలాగే ఉంది. వేతనాలను భారీగానే పెంచాలని సిఫారసు చేసిన వేతన సంఘంపై ఐఏఎస్ అధికారులు గుర్రుగా ఉన్నారు. అయినా ఉద్యోగుల వేతనాలను పెంచాలంటూ సిఫారసు చేసిన కమిటీపై ఐఏఎస్ లు ఆగ్రహం వ్యక్తం చేయడం కాస్తంత విస్తుగొలిపే విషయమైనప్పటికీ, దీని వెనుక పెద్ద కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. వేతన సవరణ సిఫారసుల్లో భాగంగా అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర సర్వీసుల అధికారుల మధ్య ఉన్న అంతరాన్ని సంఘం అసలు పట్టించుకోలేదట. అంతేకాక సదరు అంతరాన్ని తొలగించే దిశగా సిఫారసులు చేసిందనేది ఐఏఎస్ ల వాదన. వేతనంతో పాటు ప్రమోషన్ల విషయంలోనూ ఇతర సర్వీసు అధికారుల కంటే అఖిల భారత సర్వీసు అధికారులే ఓ మెట్టుపైన ఉన్నారు. అత్యున్నత సర్వీసుకు ఎంపికైన తమను ఇతర సర్వీసులకు చెందిన అధికారులతో పోల్చడాన్ని ఐఏఎస్ లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు వేతన సంఘం సిఫారసులపై నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పటికే 200 మంది దాకా సీనియర్ ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారట. తమ స్థాయిని దిగజార్చేలా సంఘం సిఫారసులున్నాయని సదరు లేఖల్లో ఐఏఎస్ లు ఆరోపణలు గుప్పించారట. మరి ఈ విషయం ఎంతదాకా వెళుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News