: మేయర్ దంపతుల హత్య కేసులో కొత్త ట్విస్ట్!...28 మందికి నోటీసులు, మరో 40 మందికీ సిద్ధం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ‘కఠారి’ మేనల్లుడు చింటూ రాయల్ అలియాస్ చంద్రశేఖరేనని పోలీసులు నిర్ధారించారు. మొన్నటిదాకా కఠారి మోహన్ వెన్నంటి ఉన్న చింటూ, ఉన్నట్టుండి మేనమామ దంపతులనే పొట్టనబెట్టుకోవడంతో ఇందుకు గల కారణాలు తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దాడి జరిగే అవకాశముందంటూ ముందే తెలిసినా, కఠారి మోహన్ అంతగా పట్టించుకోలేదన్న వాదన ఉంది. అయితే దాడికి సంబంధించి ‘కఠారి’ దంపతులను హెచ్చరించిన వారెవరు, ఆ తర్వాత ఏం జరిగిందన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో చిత్తూరు నగరానికి చెందిన పలువురు రాజకీయ నేతలతో పాటు వ్యాపారులను కూడా విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 28 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరో 40 మందికి కూడా నోటీసుల జారీకి రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. నోటీసులు అందుకున్న వారితో పాటు అందుకోబోయే వారంతా కూడా చింటూతో వ్యాపార లావాదేవీలు కలిగినవారేనన్న ప్రచారమూ సాగుతోంది. ఇదిలా ఉంటే, దాడి జరిగిన మరుక్షణమే అజ్ఞాతంలోకి వెళ్లిన చింటూ రాయల్ జాడ ఇప్పటికీ తెలియలేదు. చింటూ ఆచూకీ చెబితే లక్ష రూపాయలిస్తామని పోలీసులు ప్రకటించారు. అంటే, చింటూ పోలీసుల చేతికి చిక్కితే కానీ, ఈ కేసు చిక్కుముడి వీడేలా లేదు.