: నన్నో రాజకీయ పావును చేశారు: వాపోయిన రాబర్ట్ వాద్రా


తన వ్యాపారాలకు, తన భార్య రాజకీయ కుటుంబ నేపథ్యానికీ ఎటువంటి సంబంధం లేకపోయినా, కేవలం రాజకీయ కక్షలతో తనను వెంటాడుతున్నారని, తనను రాజకీయ అస్త్రంగా కాంగ్రెస్ పై ఉపయోగిస్తున్నారని రాబర్ట్ వాద్రా ఆరోపించారు. తాను గతంలో కొనుగోలు చేసిన భూములపై బీజేపీ పాలిత హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు విచారణ జరుపుతుండటాన్ని ప్రస్తావించిన ఆయన, తన వ్యాపారాలపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని తెలిపారు. తానెన్నడూ పారదర్శకతను వీడలేదని పీటీఐకి ఆయన వివరించారు. కాగా, ఈ రెండు రాష్ట్రాల్లో భూములను ఆయన చట్టవ్యతిరేక పద్ధతుల్లో సొంతం చేసుకున్నారని ఆరోపిస్తూ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. హర్యానా ప్రభుత్వం భూకుంభకోణాల వ్యవహారంపై విచారణ జరిపించేందుకు జస్టిస్ ఎస్.ఎన్.ధింగ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే. కాగా, ఈడీ నోటీసులపై స్పందిస్తూ, "నాపై రాజకీయ భూతం వేటాడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. వారు ఎప్పుడైనా ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తే నన్నో రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News