: యువ భారత్ చేతిలో పాక్ చిత్తు!... ఆసియా కప్ జూనియర్ హాకీ టైటిల్ భారత్ కైవసం
మొన్న క్రికెట్... తాజాగా హాకీ. యువ భారత్ చేతిలో పాక్ చిత్తుచిత్తైంది. గతంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో అప్పుడెప్పుడో జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టును చిత్తు చేసిన యువ భారత్ టైటిల్ ను చేజిక్కించుకుంది. నిన్న ఆసియా కప్ జూనియర్ హాకీలో భారత కుర్రాళ్లు పాక్ కుర్రాళ్లను చిత్తుచిత్తుగా ఓడించారు. మలేసియా నగరం క్వాంటన్ లో నిన్న ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఆది నుంచి యువ భారత్ ఆధిపత్యమే కొనసాగింది. 6-2 స్కోరుతో విజయం సాధించిన యువ భారత్ పాక్ ను నిజంగానే ‘ఆరే’సింది. భారత జట్టు డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ ప్రీత్ సింగ్ మరోమారు రెచ్చిపోయాడు. హ్యాట్రిక్ గోల్స్ సాధించిన హర్మన్ నిన్నటి మ్యాచ్ లో ఏకంగా నాలుగు గోల్స్ చేశాడు. మ్యాచ్ లో ఆద్యంతం కేక పుట్టించిన భారత కుర్రాళ్లు ఆఖరు గడియల్లో మరింత రెచ్చిపోయి పాక్ కుర్రాళ్లకు ముచ్చెమట పట్టించారు.