: సినిమా చూద్దామని వెళ్లిన ఎస్సైకి చుక్కలు చూపిన అల్లరి మూకలు
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే ఆ ఎస్సై కాస్తంత విశ్రాంతి తీసుకున్నారు. భార్యతో కలిసి సరదాగా సినిమా చూద్దామని వెళ్లారు. అయితే థియేటర్ లో అల్లరిమూకల స్వైర విహారం ఆయనలోని ఖాకీని తట్టిలేపాయి. అల్లరి చేయొద్దంటూ ఆయన ఆకతాయిలను వారించారు. అంతే, మద్యం మత్తులో ఉన్న సదరు అల్లరిమూక ఎస్సై దంపతులపై దాడికి దిగింది. సినిమా చూద్దామని వచ్చిన తనకు ఈ తరహా ఘటన ఎదురుకావడంతో సదరు ఎస్సై షాక్ తిన్నారు. వెనువెంటనే తేరుకున్న సదరు ఎస్సై తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు అల్లరిమూకల్లోని ఓ ఆకతాయిని అరెస్ట్ చేసి, మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై చౌడయ్యకు శ్రీనివాస థియేటర్ లో ఈ చేదు అనుభవం ఎదురైంది.