: ఘనంగా ములాయం పుట్టిన రోజు వేడుకలు... లాలూ గైర్హాజర్!
సమాజ్ వాది పార్టీ (ఎస్పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్ 76వ పుట్టిన రోజు వేడుకలు ఒక రేంజ్ లో జరిగాయి. ఆదివారం ఆయన స్వగ్రామమైన సాయ్ ఫాయ్ లో బర్త్ డే కేక్ ను ములాయం కట్ చేశారు. ఈ వేడుకలకు రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు, సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. అయితే, ఇంత సందడిగా, అట్టహాసంగా జరిగిన ములాయం సింగ్ బర్త్ డే వేడుకలకు ఆయనకు ఆప్తుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం హాజరుకాలేదు. బీహార్ లో నితీశ్ ప్రమాణ స్వీకారానికి ములాయం సింగ్ వెళ్లని కారణంగానే లాలూ ఈ వేడుకలకు దూరంగా ఉన్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాగా, ములాయం సింగ్ పుట్టిన రోజు వేడుకలకు భారీ మొత్తంలోనే ఖర్చయిందని, ఇదంతా ప్రభుత్వం సొమ్మేనని పలు విమర్శలు వస్తున్నాయి. ములాయం పుట్టిన రోజు నేపథ్యంలో గత రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ బృందంతో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.