: ఆ రోజున సైకిల్ పై ఆఫీసుకెళతా: సీఎం కేజ్రీవాల్
వచ్చే జనవరి 22వ తేదీన తాను సైకిల్ పై ఆఫీసుకెళతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆ రోజున ఢిల్లీలో ‘కార్ ఫ్రీ డే’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి నెలా 22 వ తేదీన ఒక్కో ప్రాంతంలో కార్ ఫ్రీ డే కార్యక్రమాన్ని ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో సైకిల్ ర్యాలీని కేజ్రీవాల్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జనవరి 22వ తేదీన ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు కార్లకు బదులు ప్రజా రవాణా వాహనాలను వినియోగించాలని కోరారు. ఆ రోజున తాను కూడా సైకిల్ పై వెళతానన్నారు. తాను చేసిన వినతిని కనీసం కొంతమంది పాటించినా తమకు గొప్ప విజయం లభించినట్లే నన్నారు. ఢిల్లీలో సైకిల్ ట్రాక్ లు ఏర్పాట్లకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.