: ఐఎస్, సిమితో చేతులు కలిపిన దావూద్?... భారత్ లో అల్లర్లకు పక్కా వ్యూహం


1993లో ముంబైలో వరుస పేలుళ్లతో మారణ హోమం సృష్టించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోమారు భారత్ లో కల్లోలానికి పక్కా ప్లాన్ చేస్తున్నాడా? ఇందుకోసం అతడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో చేతులు కలిపాడా? అంటే, అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. ఇటీవల గుజరాత్ లో బీజేపీ సహా ఆరెస్సెస్ లో కీలక భూమిక పోషిస్తున్న ఇద్దరు నేతలు దారుణ హత్యకు గురయ్యారు. వీరి హత్య వెనుక సిమి ఉగ్రవాదుల హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దావూద్ పాత్ర వెలుగు చూసింది. ఐఎస్ ఉగ్రవాదులతో కలిసి భారత్ లో కల్లోలం సృష్టించేందుకు పక్కా ప్లాన్ వేసిన దావూద్, అందుకు సిమిని పావుగా వాడుకుంటున్నాడట. పాకిస్థాన్ లో క్షేమంగా చక్కర్లు కొడుతున్న దావూద్ అక్కడి నుంచే భారత్ లోని సిమి ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధులు అందజేస్తున్నాడు. ఈ క్రమంలో భారత్ లో నేరుగా కల్లోలం సృష్టించడం కంటే బీజేపీ, ఆరెస్సెస్ నేతలను హత్య చేయడం ద్వారా దేశంలో మత ఘర్షణలను ఎగదోయాలని చూస్తున్నాడు. ఈ మేరకు అతడు అందించిన నిధులతో రంగంలోకి దిగిన సిమి ముష్కరులు గుజరాత్ లో నేతలను హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ తరహా దాడులు ఇతర ప్రాంతాల్లోనూ జరిగే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. తన ప్రత్యర్థి, మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్ తో తన ఆనుపానులన్నీ భారత్ కు తెలిసిపోతాయని భయపడుతున్న దావూద్, అంతకుముందే భారత్ లో కల్లోలం సృష్టించడం ద్వారా తాను సేఫ్ సైడ్ గా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్ లో అతడు ఐఎస్ ఉగ్రవాదులతో జట్టు కట్టాడన్న విషయం మాత్రం భారత్ కే కాక ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే విషయమే.

  • Loading...

More Telugu News