: వైద్యం వికటించి రోగి మృతి... శవాన్ని కాల్చేయబోయి పోలీసులకు చిక్కిన ఆర్ఎంపీ


హైదరాబాదులోని పాతబస్తీలో నిన్న రాత్రి దారుణం చోటుచేసుకుంది. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన ఓ రోగికి పాతబస్తీకి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చాడు. అయితే, అది వికటించి సదరు రోగి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. అయితే విషయం వెలుగుచూస్తే ఇబ్బందులకు గురవుతానని భయపడ్డ సదరు ఆర్ఎంపీ వైద్యుడు చనిపోయిన రోగిని మాయం చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతడు రోగి శవాన్ని తన బైక్ పై పెట్టుకుని శంషాబాదు వైపు పయనమయ్యాడు. జనసంచారం లేని ప్రదేశానికి కెళ్లి గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని తగులబెట్టాలన్నది ఆర్ఎంపీ ప్లాన్. అయితే బైక్ వెళుతున్న తీరుపై అనుమానం వచ్చిన స్థానికులు ఆర్ఎంపీ వైద్యుడిని ఆపి నిలదీశారు. ఈ క్రమంలో ఎక్కడ తన భాగోతం బయటపడుతుందోనన్న భయంతో వైద్యుడు పరుగు లంకించుకున్నాడు. వెంటబడ్డ స్థానికులు ఎట్టకేలకు వైద్యుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన రీతిలో విచారించగా, ఆర్ఎంపీ వైద్యుడు జరిగిన ఘటనను వెల్లడించక తప్పలేదు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రోగి శవాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News