: దుబాయిలో శశాంక్, షహర్యార్... అయినా కలవని మాట, డైలమాలో ఇండో-పాక్ సిరీస్


భారత్, పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ సిరీస్ దాయాదుల పోరుగా ప్రసిద్ధికెక్కింది. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా, ఈ రెండు దేశాల క్రికెట్ అభిమానులే కాక విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులు టీవీలకు అతుక్కుపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శతథా యత్నిస్తోంది. ఈ క్రమంలో అవకాశం చిక్కిన ప్రతిసారి పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ రంగంలోకి దిగారు. రెండు సార్లు ఏకంగా భారత్ కు వచ్చారు. మొన్నటిదాకా జగ్ మోహన్ దాల్మియా చేతిలో బీసీసీఐ పగ్గాలుండగా, ఆయన మరణంతో తాజాగా శశాంక్ మనోహర్ బీసీసీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో శశాంక్ తో భేటీ అయ్యేందుకు మొన్న షహర్యార్ ఖాన్ నేరుగా ముంబై వచ్చారు. అయితే శివసేన కార్యకర్తల ఆందోళనల నేపథ్యంలో నాడు షహర్యార్ చర్చలు జరపకుండానే వెనుదిరిగారు. ఇక భారత్-పాక్ క్రికెట్ సిరీస్ కు అవకాశం లేకపోలేదంటూ బీసీసీఐ పగ్గాలు చేపట్టిన తర్వాత శశాంక్ కూడా వ్యాఖ్యానించారు. అయితే నిన్న దుబాయిలోనే గడిపిన వీరిద్దరూ మర్యాదపూర్వకంగా కూడా కలుసుకోలేకపోయారు. ఐసీసీ కార్యాలయంలో శశాంక్ ఉండగా, అక్కడికి అతి సమీపంలోని దుబాయి క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో షహర్యార్ ఉన్నారు. వీరిద్దరి మధ్య భేటీ జరుగుతుందని... భారత్-పాక్ సిరీస్ కార్యరూపం దాల్చే విధంగా చర్చలు జరుగుతాయని అంతా భావించారు. అయితే వీరిద్దరి మధ్య భేటీ కాదు కదా కనీసం మాట కూడా కలవలేదు. దీంతో ఇండో-పాక్ సిరీస్ మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.

  • Loading...

More Telugu News