: పాకిస్థాన్ లో వేదికలు చూపించండి...టీమిండియా ఆడుతుంది: రాజీవ్ శుక్లా
పాకిస్థాన్ లో టీమిండియా ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆటగాళ్లకు, ప్రేక్షకులకు సురక్షితమైన వేదికలు చూపించాలని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సూచించారు. తటస్థ వేదిక అంటూ యూఏఈని పాకిస్థాన్ ఎంచుకోవడంతో ఆ దేశంలో క్రికెట్ ఆదరణ కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన పీసీబీని హెచ్చరించారు. పాకిస్థాన్ లోని లాహోర్ స్టేడియంకి దగ్గర్లో ఆటగాళ్లు బస చేసేందుకు సురక్షితమైన హోటల్ నిర్మించి, స్టేడియంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తే క్రికెట్ ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. భద్రతపై పీసీబీ ముందుగా ఐసీసీ, ఇతర బోర్డుల అనుమతులు తీసుకుంటే ఆ తరువాత ఆడడం గురించి మాట్లాడవచ్చని ఆయన తెలిపారు. వారు అనుమతిస్తే ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. సమయం దగ్గర పడుతుండడంతో మీనమేషాలు లెక్కించడం మానేసి భారత్ లో ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డు సిద్ధపడాలని ఆయన సూచించారు. పీసీబీకి చేకూరే నష్టాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.