: 'కూలీ'లకు దుస్తులు పంచిన అమితాబ్!
నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ తాను మెగాస్టార్ నే అని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంతకు ముందు చాలాసార్లు రుజువు చేసుకున్నాడు. అదే విషయాన్ని ఈరోజు మరోసారి ప్రూవ్ చేశాడు. ముంబైలో ఓ ప్రారంభోత్సవానికి హాజరైన అమితాబ్ అక్కడికి దగ్గర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి వద్దకు నడిచి వెళ్లారు. అక్కడ కూలీలతో కాసేపు గడిపి, గతంలో తాను పలు సినిమాల్లో ధరించిన దుస్తులను అక్కడి కార్మికులకు పంచారు. ఆయన అందించిన ఆ ఖరీదైన రంగురంగుల జాకెట్లను, జర్సీలను సొంతం చేసుకున్న కార్మికుల కళ్లల్లో ఆనందం, కృతజ్ఞత కనిపించాయి. తమ అభిమాన నటుడు తమనే వెతుక్కుంటూ వచ్చి, ముచ్చటించడమే కాకుండా అలా బహుమతులు కూడా ఇవ్వడంతో వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమితాబ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.