: నేపాల్ లో మందుల సంక్షోభం
నేపాల్ ను ఒక్కో సమస్య చుట్టుముడుతోంది. తాజాగా మందుల సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. భారత సరిహద్దుల వద్ద ఉన్న చెక్ పోస్టుల్లో పెట్రోల్, డీజిల్, మందులు, నిత్యావసరాలు తదితరాలను నిరసనకారులు అడ్డుకుంటున్నారు. ఇటీవలే అమల్లోకి వచ్చిన నూతన రాజ్యాంగాన్ని నిరసిస్తూ మాధేసి సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఆందోళనలు చేపట్టారు. అందులో భాగంగా భారత్ నుంచి నేపాల్ లోకి వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారు. నేపాల్ లోకి రవాణా జరగకుండా అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలో, ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సంక్షోభం తలెత్తింది. తాజాగా మందులు కూడా అయిపోతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే, అత్యవసరమైన ఆపరేషన్లు కూడా చేయలేమని డాక్టర్లు చెబుతున్నారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ, భూకంపం కన్నా ఈ దిగ్బంధనం అనేక రెట్లు ప్రభావం చూపుతోందని అన్నారు.