: మాలి ఉగ్ర దాడుల్లో భారత సంతతి మహిళ దుర్మరణం


మాలి రాజధాని బమాకోలోని హోటల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఓ భారత సంతతి మహిళ కూడా ఉండటం ఆవేదన కలిగిస్తోంది. 41 ఏళ్ల వయసున్న అనిత అశోక్ ఉగ్రదాడులకు బలైందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అనిత అశోక్ తో పాటు మాలి దాడుల్లో చనిపోయిన అందరికీ నివాళి అర్పించారు. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మాలి ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. మరోవైపు అనిత మరణంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అనిత మరణాన్ని నమ్మలేకపోతున్నామని... ఉగ్రవాద చర్యలకు ఆమె బలవడం కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వాషింగ్టన్ డీసీ లోని మేరీల్యాండ్ లో అనిత కుటుంబం నివసిస్తోంది. ఓ సామాజిక కార్యకర్తగా అనిత ఎంతో సేవ చేశారు. గతంలో రెండేళ్ల పాటు 'పీస్ కార్ప్స్' తరపున సెనెగల్ లో సేవలు అందించారు. అంతేకాకుండా, గ్లోబల్ హెల్త్, ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్, ఫ్యామిలీ ప్లానింగ్, హెచ్ఐవీల సమస్యలపై ఆమె పనిచేశారు.

  • Loading...

More Telugu News