: మా పార్టీని విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదు: కిషన్ రెడ్డి
గత కొన్ని రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఇతర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. తమ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఏపీకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని బీజేపీపై వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఖండించారు. బీజేపీని విమర్శించే హక్కు సీఎం కేసీఆర్ కు లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడితే సహించబోమని మీడియా సమావేశంలో హెచ్చరించారు. రాష్ట్రంలో ఒక్క గజ్వేల్ కే రూ.430 కోట్లు సీఎం సహాయనిధిని ఎందుకు కేటాయించారో సీఎం చెప్పాలని నిలదీశారు. అలాగే రాష్ట్రానికి కేవలం 10వేల ఇళ్లు మాత్రమే కావాలని ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపిందని, అంతవరకే కేంద్రం మంజూరు చేసిందని పేర్కొన్నారు. అలాంటప్పుడు కేంద్రాన్ని విమర్శించడం తగదన్నారు.