: ఇకపై ఆడంబర వివాహాలకు ఫైన్... ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్న కర్ణాటక సర్కార్


భారతదేశంలో పెళ్లిళ్లు భారీ ఎత్తున జరుగుతుంటాయి. ఎవరి తాహతును బట్టి వారు ఆడంబరంగానే చేస్తుంటారు. లక్షలు... కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తమ స్థాయిని ప్రదర్శిస్తుంటారు. అయితే, ఇకపై ఇలాంటి ఆడంబరాలకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ముసాయిదా బిల్లును రూపొందించి... ఆ రాష్ట్ర శాసనసభలో సభ్యుల అనుమతి కోసం ప్రవేశపెట్టింది. ముసాయిదా బిల్లులోని నిబంధనలు చూస్తే... ఇందులో భాగంగా పెళ్లి ఖర్చు రూ.5 లక్షలు దాటితే విలాస పన్ను విధిస్తారు. కల్యాణ మండపం అద్దె రూ.50 వేలకు మించకూడదు. ఎక్కువ వసూలు చేస్తే కల్యాణ మండపం నిర్వాహకులూ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అతిథులు 300లు కంటే ఎక్కువ మంది హాజరుకాకూడదు. పెళ్లి పందిరిలో అలంకరణ పరిమితంగా ఉండాలి. వధూవరులకు అతిథులు బహూకరించే కానుకలపైనా పన్ను విధించాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. కొత్త దంపతులు పెళ్లిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. వధూవరులు, వారి తల్లిదండ్రుల పుట్టిన తేదీలు, ఇతర వివరాలన్నింటినీ అందులో సమగ్రంగా పేర్కొనాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే వధూవరుల తల్లిదండ్రుల నుంచి అపరాధ రుసుము వసూలు చేస్తారు. అయితే ప్రభుత్వ నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక న్యాయశాఖ మంత్రి జయచంద్ర మాట్లాడుతూ, వివాహాల సందర్భంగా ప్రస్తుత కాలంలో వీపరీతంగా ధనం ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఆహారం కూడా చాలా వృథా అవుతోందని, గ్రామీణ ప్రాంతాల వారు ఈ విధానానికి ప్రభావితులు అవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News